ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీవన వ్యయ, ప్రమాణాలను ప్రతిబింబించేలా పీఆర్‌సీ నివేదిక లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆక్షేపించారు. బిస్వాల్ కమిటీ 30 నెలలకుపైగా కాలయాపన చేసి ఇంత నిర్లక్ష్యంగా, అసంబద్ధంగా, కనీస అవగాహన లేకుండా పీఆర్‌సీని రూపొందించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ నివేదికను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఆమోదయోగ్యమైన పీఆర్‌సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో అమలైన 10 శాతం పీఆర్‌సీ కంటే ఇది హీనంగా ఉందని తమ్మినేని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తుండగా.. మన రాష్ట్రంలో ఐఆర్ ఇవ్వకుండా, పీఆర్‌సీని కేవలం 7.5 శాతంగానే సిఫార్సు చేయడం దారుణమన్నారు.
మనోభావాలను దెబ్బతీయడమే..!
ఐదేళ్లకోసారి సవరించే ఈ వేతన సవరణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గౌరవప్రదంగా జీవించే విధంగా లేదని విమర్శించారు. రూరల్ ఏరియా అలవెన్స్ ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని ఇందులో ప్రస్తావించలేదని.. నిత్యావసర వస్తువుల ధరలు, శాస్త్రీయ అంశాల ఆధారంగా ఈ పీఆర్‌సీ రిపోర్టు లేకపోవడం ఉద్యోగులు, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి, ఉద్యోగ సంఘాలకు ఆమోదయోగ్యమైన పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.