CPM Central Committee Meetings: కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
''జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చిస్తాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై.. ప్రణాళికలు రూపొందిస్తాం. పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందించి... మహాసభలకు 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తాం. సభ్యులు ముసాయిదా తీర్మానంపై సవరణలు పంపొచ్చు. ఏప్రిల్‌లో కేరళలో పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నాం.''
- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్, ప్రకాష్ కారాట్, బృందా కారాట్, బిమన్ బసు, రామచంద్రన్ పిళ్ళై, సుభాషిణి అలీ, బీవీ రాఘవులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి.. ఆయన తండ్రి రాజీనామా చేయాలి'