కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు… వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి విన్నవించారు. కరోనా విస్తృతి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తక్షణ సహాయం గురించి ఈటల రాజేందర్‌ను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతి బీ వెంకట్ కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వ అజాగ్రత్త, అశ్రద్ధ, అతి విశ్వాసంతో కరోనా రెండో దశ మొత్తం దేశాన్నే అతలాకుతం చేస్తోందన్నారు. లక్షలాది మంది కరోనా మహమ్మారికి గురికావడానికి వేల మంది రోజూ చనిపోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రధానమంత్రి బాధ్యత వహించాలని తెలిపారు. కరోనా రెండో దశ గురించి ఎంతమంది హెచ్చరించినా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఆక్సిజన్ దొరక్క వందల మంది మృత్యువాత పడుతున్న ఘటనలు హృదయవిదారకంగా ఉన్నాయని వాపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా తమ పర్యటనల్లో గుర్తించిన అంశాలను మీ దృష్టికి తెస్తున్నామని వారు మంత్రికి తెలిపారు. తక్షణ చర్యలు చేపట్టాలని వారు ఈటలకు విన్నవించారు. కరోనాపై పోరులో పౌరసమాజాన్ని కూడా పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని కోరారు. వివిధ స్థాయిల్లో ప్రముఖులతో కరోనా పోరాట కమిటీలు వేయాలని సూచించారు. పైవాటితో పాటు కరోనాపై తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రికి తమ పార్టీ నుంచి లేఖ రాసినట్లు వారు తెలిపారు.