రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో తెరాస ప్రభుత్వం ఉద్యమించాలని సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, గిరిజన యూనివర్సిటీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల ఓట్లను దండుకుని ఎంపీలుగా గెలిచిన భాజపా నాయకులు.. నిమ్మకు నీరెత్తినట్లు పార్లమెంటులో కూర్చున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న తెరాస పార్లమెంటులో హామీల అమలుకు కృషి చేయలేదని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.