రాజధానిలో నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద ముంపునకు గురయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నిజాం కాలంలోనే వికారాబాద్ నుంచి ఇబ్రహీపట్నం వరకు నాలా ఉండేదన్నారు. అక్రమ కట్టడాలు వరద నీరు పోయేందుకు అటంకంగా మారాయన్నారు. ప్రభుత్వానికి ఎంఐఎంతో దోస్తీ వల్ల వాటి జోలికి వెళ్లడం లేదని బహిరంగంగా విమర్శించారు. 2002లో కిర్లోస్క్ర్, 2007లో ఓయన్స్ కంపెనీలు వాటిపై సర్వే నిర్వహించాయన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక జేఎన్టీయూ సర్వే చేసిందని, నాలాల మరమ్మత్తులకు రూ. 12 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిందన్నారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు తొలగించకుండా ప్రతిపక్షాలపై నింద వేస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశద్ధి ఉన్నా హైదరాబాద్‌తో సహా కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.