రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగరకమిటీ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి పార్టీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, ఈటీ నరసింహాతో పాటు సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరాయి.
అప్రమత్తమైన పోలీసులు సీపీఐ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లతో పాటు గుడిసెలు వేసుకున్న వాళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం