ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే కంటైనర్లను తనిఖీ చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పోలీసులను ఆదేశించారు. ఆవులను, ఒంటెలను కంటైనర్లలో తరలించే అవకాశం ఉందన్నారు. సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భారీ వాహనాలను తనిఖీ చేయాలని సజ్జనార్ అధికారులకు సూచించారు.
ఆగస్టు ఒకటిన జరుపుకునే బక్రీద్ పండగ సందర్భంగా పలు శాఖల అధికారులతో సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆవులు, ఒంటెలను వధించడం నిషేధమని సజ్జనార్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ భద్రత పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై సమన్వయ సమావేశంలో చర్చించారు. చట్టాలు ఎవరు కూడా చేతిలోకి తీసుకోవద్దని.. ఏదైనా సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?