మనిషికి తెలియకుండానే శరీరాన్ని కుంగదీసే భయంకరమైన వ్యాధి పక్షవాతమని యశోదా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్.రావు అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.
సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన చిన్నతనంలో చదివిన ఓ వార్తా కథనాన్ని సీపీ గుర్తు చేసుకున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత ఉండేదని... ఇప్పుడు ప్రజల్లో గుండె జబ్బులపై అపారమైన పరిజ్ఞానం ఉన్నప్పటికీ.. పక్షవాతం వంటి వ్యాధులపై మరింత అవగాహన రావాల్సి ఉందన్నారు.
భారత్‌లో ఏటా ప్రతి లక్ష మందిలో సుమారు 145 నుంచి 154 మంది పక్షవాతం భారిన పడుతున్నారని డాక్టర్ జీఎస్.రావు పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సైతం డ్రగ్స్, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు బానిసలవ్వటం వల్ల పిన్న వయసులోనే పక్షవాతం సోకే ప్రమాదం పెరుగుతోందన్నారు. ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్‌కి భయపడాల్సిన అవసరం లేదని వేగంగా స్పందిస్తే పక్షవాతం ముప్పు నుంచి బయటపడొచ్చని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు: ఉపరాష్ట్రపతి