కొవిడ్ బాధితుల కోసం హైదరాబాద్ పాత బస్తీ వాదియేహుదాలోని ముస్లిం జనరల్ ఆస్పత్రిలో కొవిడ్ ఆక్సిజన్ థెరపీ సెంటర్ను ఏర్పాటు చేశారు. జమాతే ఇస్లామీహింద్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంస్థ అధ్యక్షుడు మౌలానా హామిద్ మహమ్మద్ ఖాన్.. కేంద్రాన్ని ప్రారంభించారు. ఆక్సిజన్ థెరపీ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎన్జీవోలు ముందుకు రావాలని సూచించారు.
ఈ కేంద్రంలో 40 మంది వైద్య సిబ్బందితో పాటు, 50 పడకలను కరోనా రోగులకు అందుబాటులో ఉంచినట్లు ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి హఫీజ్ రషాదుద్దీన్ తెలిపారు. నామమాత్రపు ఖర్చుతో ఇక్కడ చికిత్స పొందవచ్చని చెప్పారు. సేవా దృక్పథంతోనే కొవిడ్ సెంటర్ను ప్రారంభించామని, 3 నెలలపాటు ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ థెరపీ చికిత్సలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
1970 నుంచి ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ.. విద్య, వైద్య రంగాల్లో పలు సేవలందిస్తోందని మహమ్మద్ ఖాన్ అన్నారు. ప్రారంభోత్సవంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్, డేర్ అసోషియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఖబీర్ సిద్దీఖీ, ఎస్ఐవో తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ తల్హా ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తరుగు పేరుతో తీసే ధాన్యం విలువ రూ.488 కోట్లు