కరోనా మహమ్మారి మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్ సోకినవాళ్లు బతికి బయటపడితే చాలనుకుంటున్నారు. గతంలో వైరస్ సోకిన వారిలో 70 శాతం మంది ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. ఆరోగ్య సమస్యలు స్వల్పంగానే ఉండేవి. తక్కువ మందికే వెంటిలేటర్ అవసరం అయ్యేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వైరస్ నిర్ధరణ అయినవారిలో 50శాతానికి పైగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గతం కంటే రెట్టింపు మందికి వెంటిలేటర్ వాడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఉన్నాయో లేదో... చికిత్సలపై అపోహలతో జనం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అక్కడ రోజూ కనీసం 50 నుంచి 70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. బాధితులు వైరస్ నుంచి కోలుకున్నా ఆర్థికంగా మాత్రం కుదేలవుతున్నారు.
పడకల అందుబాటు
వాస్తవానికి ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స అందించిన అనుభవం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉంది. ఎక్కడైనా అవే మందులు ఇస్తారు. ఆక్సిజన్ లోటు పాట్లు లేకుండా 22 ప్రభుత్వాస్పత్రుల్లో భారీ ట్యాంకులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 33ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 15,051 సాధారణ పడకలు , 5,268 ఆక్సిజన్ పడకలు, 17,023 పడకలు వెంటీలేటర్ పడకలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వాసుపత్రుల్లో 8,542 పడకలు అందుబాటులో ఉంచారు. అందులో ఇప్పటి వరకు పూర్తైంది కేవలం 12,041 పడకలు మాత్రమే. 7,301 పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ గవర్నమెంట్ ఆస్పత్రిలో మాత్రమే దాదాపు 50శాతానికి పైగా పడకలు నిండాయి.
జీహెచ్‌ఎంసీలో ఖాళీలే..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ రోగుల 110 పడకలు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఛాతీ ఆస్పత్రిలో 123 పడకలకు కేవలం నాలుగు మాత్రమే భర్తీ అయ్యాయి. కింగ్ కోఠీ జిల్లా ఆస్పత్రిలో 350 పడకలకు గాను 217 పడకలు అందుబాటులో ఉన్నాయి. గాంధీలో 18,090పడకలకు 17,017 పడకలు ఖాళీగానే ఉన్నాయి. టిమ్స్‌లో 12,061 పడకలు ఉండగా వాటిలో 974 ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన కొవిడ్ రోగులకు ప్రభుత్వం కేటాయించిన పడకల్లో దాదాపు 80శాతం అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల విషయానికి వస్తే 10,916 పడకలు ఉండగా.. 3,429 పడకలు నిండాయి.
ఆందోళన అవసరం లేదు
కరోనా రోగులకు సరైన సమయానికి మెరుగైన చికిత్సలు అందించేందుకు ఎక్కడిక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరాను పెంచామని.. క్వారంటైన్ సెంటర్లను అధికం చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏదేమైనా ప్రజలు కరోనా నిబంధనలు పాటించి.. వైరస్ సోకకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన పడకలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు