హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముషీరాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయగా... చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రాలను నిజాం కళాశాలలో ఏర్పాటు చేశారు. వీటిని ఎన్నికల అధికారి దాన కిషోర్, సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు.
ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభం
హైదరాబాద్ జిల్లాలో మొత్తం కౌంటింగ్ కేంద్రాలు 14 ఉన్నాయి. అందులో ప్రతి లెక్కింపు హాల్లో 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తం లెక్కింపునకు 588 సిబ్బందిని కేటాయించారు. మరో 20 శాతం మందిని రిజర్వ్‌లో ఉంచారు. 23న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు మంచినీరు, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను దాన కిశోర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదిలేదని చేశారు.
మొదటగా పోస్టల్ బ్యాలెట్
మొదటగా కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేస్తారు. తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఐదు వీవీ ప్యాట్‌లను లెక్కిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం, కేంద్రాలను పోటీచేసే అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లను చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో 9 లక్షల 10 వేల 437 ఓట్లు, 3 వేల 900 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ స్థానంలో 8 లక్షల 76 వేల 78 ఓట్లు, 2 వేల 696 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇవీ చూడండి: అబ్బురపరుస్తున్న గురుకుల డిగ్రీ కళాశాలలు
నగరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు
ముషీరాబాద్, నాంపల్లి - ఎల్బీ స్టేడియం
బహదూర్‌పుర, కార్వాన్ - మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల
చాంద్రాయణగుట్ట - నిజాం కలేజీ
చార్మినార్ - కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్
యాకుత్‌పుర - వనిత మహిళా కళాశాల ఎగ్జిబిషన్ మైదానం
సికింద్రాబాద్ - ఉస్మానియా దూర విద్యాకేంద్రం
సనత్‌నగర్ - ఓయూ ఎం.బి.ఏ కళాశాల
అంబర్‌పేట్ - రెడ్డి ఉమెన్స్ కాలేజీ
జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం