- ఉప్పల్ పరిధిలో ఫుడ్ కోర్టు నడిపే ఓ వ్యక్తి.. ఇటీవల రామంతాపూర్ హోమియోపతి కళాశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆరోజు నెగెటివ్ అని తేలడంతో యథావిధిగా వ్యాపారం చేసుకున్నారు.. ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ పాజిటివ్ అని ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సొంతూరికి పంపించేసి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానమొచ్చి మళ్లీ ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తే నెగెటివ్ అని తేలింది. మూడు రోజులు వ్యాపారం బంద్ కావడంతోపాటు ఇంట్లో వాళ్లకు హైరానా తప్పలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’’
- ‘‘అత్తాపూర్‌కు చెందిన ఓ మహిళ భర్తకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈమె కూడా పరీక్షలు చేయించుకున్నారు. తొలుత నెగెటివ్ ఉన్నట్లు నివేదిక వచ్చింది. రాత్రికి మళ్లీ పాజిటివ్ ఉన్నట్లు మరో సందేశం రావడంతో అవాక్కయ్యింది. దీంతో ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో ఐసోలేషన్‌కి వెళ్లారు. ఆ పక్కింట్లోనూ మరో మహిళకు ఇదే అనుభవం ఎదురవడం గమనార్హం.’’
ఇవే కాదు నగరవ్యాప్తంగా చాలాచోట్ల ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో ఇలాంటి ఇక్కట్లే తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ఫలితాలు తారుమారు అవుతుండగా.. మరికొన్ని చోట్ల రోజులు గడుస్తున్నా అనుమానితులకు ఫలితాలే అందట్లేదు. మరుసటి రోజు బాధితులు మళ్లీ కేంద్రాలకు వెళితే ఏదో ఓ సమాధానం చెప్పి పంపిస్తున్నారు అక్కడి సిబ్బంది. మూడు జిల్లాల పరిధిలో రోజూ వందల మందికి ఇది కొత్త తలనొప్పిగా మారుతోంది. గంటల తరబడి వరసలో నిలుచుని ఫలితాల్లో అవకతవకలతో వారికి ఆందోళన తప్పట్లేదు. దీనిలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కేంద్రాల్లో పరీక్షలకు వచ్చే అనుమానితులకు ఇచ్చే నెంబరింగ్ టోకెన్ విధానం, పరీక్ష చేసి తేల్చే విధానంలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని ఆరోపణలొస్తున్నాయి.
సర్వర్ సతాయిస్తోంది.. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఈ కేంద్రాల్ని సర్వర్ సమస్యలు వేధిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఈ సమస్య ఎక్కువుందని ఆరోగ్య కేంద్రాల వైద్యులు చెబుతున్నారు. అందువల్లే ఫలితాల్లో జాప్యం కావడంతో పాటు కొన్నిసార్లు తప్పులు దొర్లుతున్నాయని చెప్పుకొస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది లేమి కూడా దీనికి కారణమవుతోందని.. మాపై ఒత్తిడి పడుతోందని కొందరు టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్జాగా ప్రైవేట్ దోపిడీ..! ![]() గ్రేటర్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రైవేట్ కేంద్రాల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షకు రూ.500, ఇంటి వద్దకు వచ్చి నమూనా తీసుకుంటే రూ.750 తీసుకోవాలని నిర్ధారించింది. కానీ, నగరంలోని చాలావరకు ప్రైవేట్ కేంద్రాలు ఈ నిబంధనల్ని పాటించట్లేదు. శానిటేషన్, పీపీఈ కిట్ల పేరిట బాధితుల్ని దోచుకుంటున్నారు.
|
ఇదీ చూడండి: రెండు శరీరాలు, ఒకటే ఆత్మ.. వారే సీతారాములు!