ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తిరిగి విజృంభిస్తున్నప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో భారీగా కేసులు నమోదపుతున్నాయి. అందులోనూ తిరుపతిలోనే ఎక్కువగా ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ కేంద్రాలను మూసివేసింది. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు పొందిన యాత్రికులనే ప్రస్తుతం తిరుమలకు అనుమతిస్తున్నారు. దీనివల్ల శ్రీవారిని దర్శించుకునే రోజువారీ భక్తుల సంఖ్య 20 వేల నుంచి 25వేల వరకు మాత్రమే ఉంటుంది.
తిరుమలకు వచ్చే యాత్రికులు కరోనా జాగ్రత్తలు పాటించాలని... ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రావొద్దని తితిదే విజ్ఞప్తి చేస్తోంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో భక్తులను పరీక్షించాకే పైకి అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. గదులు పొందే కేంద్రాల వద్ద, కల్యాణకట్ట, అన్నప్రసాదం వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కేటాయించిన సమయానికే యాత్రికులు రావాలని అధికారులు కోరుతున్నారు. క్యూలైన్లలో మాస్కులు దర్శించడం, భౌతికదూరం పాటించడం, క్యూలైన్లను తాకకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా నిబంధనల అమలు, దర్శన సౌకర్యం కల్పిస్తున్న తీరుపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తుల సంఖ్యను మరింతగా తగ్గించాలని తితిదే భావిస్తోంది. ఈ నెలాఖరు వరకు రోజుకు 25 వేల టిక్కెట్లను జారీ చేయగా... వచ్చే నెల నుంచి రోజుకు 15 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. మే నెల కోటా టిక్కెట్లను 20వ తేదీన విడుదల చేయనుంది. ఇక ప్రత్యేకదర్శన టిక్కెట్లు ఉన్నా కొందరు భక్తులు తిరుమలకు రావడం లేదని గుర్తించిన దేవస్థానం బోర్డు... ఈ నెల 21 నుంచి 30 వరకు టిక్కెట్లు కొన్నవారు 90 రోజుల్లో ఎప్పుడైనా స్వామివారి దర్శనానికి రావొచ్చని ప్రకటించింది.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి ఆమోదానికి వేతన సవరణ దస్త్రం