పరీక్ష ఆగింది.. ఆందోళన మొదలైంది! - హైదరాబాద్ వార్తలు
నగరంలో కేసులు పెరగడం వల్ల ప్రజల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతున్నది. చిన్న చిన్న లక్షణాలున్నా జనాలు భయపడుతున్నారు. ఆ భయంతోనే చాలామంది పరీక్షా కేంద్రాలకు పోటెత్తుతున్నారు. అయితే.. ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా పరీక్షలు ఆపేయడం వల్ల పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారంతా అసహనంతో వెనుదిరుగుతున్నారు.
నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో ఉంటున్న ఓ యువకుడికి కొద్దిరోజులుగా సుస్తీ చేసింది. కోరనా భయంతో జూన్ 25న పరీక్షలు చేయించుకునేందుకు సరూర్ నగర్‌లోని కరోనా పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత పరీక్షలు చేయడం లేదంటూ వెనక్కి పంపారు. ఏం చేయాలో తెలియక.. అతనిలో మరింత ఆందోళన మొదలైంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్ పరిధిలో సరూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో ఒకే కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి అక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారు. నిత్యం దాదాపు 300 పైగా అనుమానితులు ఇక్కడికి వస్తున్నారు. కరోనా భయంతో ఈ నెల 25న వచ్చిన బాధితులు.. ఇక్కడ పరీక్షలు నిర్వహించడం లేదన్న సమాధానంతో వెనక్కి తిరిగారు.
నగర వ్యాప్తంగా వారు రోజులుగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు కేంద్రంగా కరోనా పాజిటివ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30వేల పరీక్షలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో దాదాపు 8 వేల దాకా ఫలితాలు రావాల్సి ఉంది. వాటిని పూర్తి చేశాకే.. తిరిగి కొత్త పరీక్షలు నిర్వహించేందుకు రెండు రోజుల ప టు తాత్కాలికంగా పరీక్షలు నిలిపివేశారు. గోల్కొండ, రామంతాపూర్ ప్రాథమిక వైద్య కేంద్రాలు, అంబర్ పేట పీహెచ్సీ, జియాగూడ, మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి, ఆయుర్వేద దవాఖాన, అమీర్‌పేట ప్రకృతి చికిత్సాలయం, సూరారం రాజీవ్ గృహకల్పలో వారం రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే.. నగరంలో కొద్దిరోజులుగా చేస్తున్న నిర్ధారణ పరీక్షల్లో తరచూ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బండ్లగూడ పరిధిలో ఓ వ్యక్తి ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానిక అధికారులకు ఈ విషయం గురించి సమాచారం లేకపోవడం వల్ల ఆయనను ఎవరూ సంప్రదించలేదు. ఏం చేయాలో తెలియక.. ఇంటికే పరిమితమయ్యాడు. మహేశ్వరంలోని ఓ అంగన్వాడీ టీచర్‌కి పాజిటివ్ వచ్చింది. అధికారులు ఆమెకు ఫోన్ చేయకుండా.. అదే పేరుతో ఉన్న మరో ఏఎన్ఎంకు ఫోన్ చేశారు. అధికారుల తప్పిదం వల్ల ఆ ఏఎన్ఎం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కొద్దిసేపటికి పొరపాటును గమనించిన అధికారులు మళ్లీ ఆమెకు ఫోన్ చేసి పొరపాటు గురించి చెప్పడం వల్ల వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారుల అలసత్వం వల్ల కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తే పరిస్థితి కొంతవరకు అదుపులోకి రావచ్చంటున్నారు ప్రజలు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం