హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిర్మాణ రంగం అతిపెద్దది. సంవత్సరం పొడవునా పనులు జరుగుతుంటాయి. నిర్మాణాలపైనే ఆధారపడి ఇసుక, కంకర, ఇటుక, టైల్స్, సిమెంట్, ఇనుము వంటి అనుబంధ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ముఖ్యంగా చిరు, మధ్యస్త వ్యాపారులు గృహ నిర్మాణానికి ప్రాథమికంగా అవసరమయ్యే ఇసుక, కంకర, ఇటుక విక్రయిస్తుంటారు. నగర శివారుల్లో ఈ తరహా వ్యాపారాల వల్ల కూలీలు, రవాణా వాహనాల డ్రైవర్లకు ఉపాధి లభిస్తుంది. కొవిడ్ మహమ్మారి విజృంభణతో నిర్మాణాలు నెమ్మదించి ఆ ప్రభావం అనుబంధ రంగాలపైన పడింది. ఫలితంగా అమ్మకాలు లేక, కొనుగోలుదార్లు రాక పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు లాక్‌డౌన్ అమలు వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరువ్యాపారులపై ప్రభావం
కరోనా ఉద్ధృతి వల్ల ఇప్పటికే ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌కు ముందే చాలా మంది వెళ్లిపోగా.. ఇప్పుడు కూలీలు దొరకడమే గగణంగా మారింది. ఆ ప్రభావం నిర్మాణాలు, దానిపైనే ఆధారపడిన చిరువ్యాపారాలపై తీవ్రంగా పడుతోంది. స్థలం అద్దెలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు గోడు వెల్లబోసుకుంటున్నారు.
నిరాశగా వెనుదిరుగుతున్న కూలీలు
లాక్‌డౌన్ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగానే పడుతుందని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూలీల కొరత ఉండగా.. లాక్‌డౌన్ అమలుతో ప్రారంభించిన పనులు పూర్తిచేయడానికి ఎంత సమయం పడుతుందో తెలియని అయోమయం నెలకొందంటున్నారు. రాష్ట్రంలో 10 రోజుల లాక్‌డౌన్ అమలుతో వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. మరికొందరు కూలీ పనుల కోసం అడ్డామీదకు వచ్చి ఉదయం 10 గంటలు దాటగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఇదీ చదవండి: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన టీఎస్ ఆగ్రోస్