లాక్‌డౌన్ తర్వాత కరోనా విజృంభిస్తోంది. అన్ని రంగాలకు చెందిన వాళ్లు వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఎక్కువ మంది కొవిడ్ బాధితులుగా తేలుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ పరిధిలోని 63 పోలీస్‌స్టేషన్‌లలో అన్ని విభాగాలు కలుపుకొని 10 వేల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అత్యధికంగా 26 మంది వైరస్‌కు గురయ్యారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చరవాణి పరిశీలనలో హోంగార్డుకు సోకిన వైరస్.. క్రమంగా స్టేషన్‌లో ఇతరులకు వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పీఎస్‌లో దాదాపు 10 మందికి కొవిడ్ సోకింది. టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లోనూ ఒకే రోజు ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ పదుల సంఖ్యలో పోలీసులకు వైరస్ నిర్ధరణైంది.
నిందితుల నుంచి..
కరోనా లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల గోషామహల్‌లో ప్రత్యేకంగా పరీక్షలు సైతం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 వందల మందికి పరీక్షలు జరపగా 230 మందిలో లక్షణాలు బయటపడి చికిత్స పొందుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఉన్నతాధికారులకు కరోనా సోకగా... వారిలో ఇద్దరికి రెండు రోజుల తర్వాత నెగిటివ్ రావడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకుతుండటం క్షేత్రస్థాయిలో పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. దర్యాప్తులో భాగంగా నిందితుల విచారణ.. రిమాండ్‌కు తరలింపు.. తదితర సందర్భాల్లో కరోనా సోకుతుందని కలవర పడుతున్నారు.
కరోనా కట్టడికి చర్యలు
వైరస్ కట్టడికి డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. ఒంట్లో నలతగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఠాణాలు రసాయనాలతో శుభ్రం చేయాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు, రోగ నిరోధకశక్తి పెరిగేలా ఔషధాలు అందిస్తున్నారు. బాధితులకు పోలీస్ సంక్షేమ నిధి నుంచి తాత్కాలిక సాయంగా ఐదు వేల రూపాయల నగదు ఇస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందే సౌలభ్యం కల్పించారు.
అటు వైద్య సిబ్బంది సైతం అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఓపీల్లో ప్రధాన పాత్ర పోషించే పీజీ వైద్య విద్యార్థులు అధికంగా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకూ 75 మంది వైద్యులు, 8 మంది నర్సులు, ఇతర సిబ్బంది ఏడుగురు కరోనాబారిన పడ్డారు. ఈ నేపథ్యంలో... మాస్కులు, ఇతర వ్యక్తిగత పరిరక్షణ వస్తువులను ధరించి విధులు నిర్వర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: సుదీర్ఘంగా భారత్-చైనా సైనికాధికారుల చర్చలు