Corona Effect on Pneumonia Victims : న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో కొవిడ్ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ 14 నెలల బాలుడికి న్యుమోనియా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పరీక్షలు చేయగా, వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో న్యుమోనియాతో 83 మంది పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. వీరందరికీ కొవిడ్ పరీక్షలు (Covid Tests in Telangana) చేయనున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే ఉంటుండటంతో పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడుతున్నారు. సంవత్సరంలోపు పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. వైరల్ న్యుమోనియా 3-4 వారాల్లో తగ్గిపోతుంది. కరోనా వైరస్ వల్ల కూడా న్యుమోనియా సోకుతోందని, దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
'కరోనా న్యూ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి'
అప్రమత్తత తప్పనిసరి : న్యుమోనియా సాధారణంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిలోఫర్ ఆసుపత్రి (Nilofar Hospital) సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో చేరి ఎక్కువ కాలం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నవారిపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. న్యుమోనియాతో పాటు కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉషారాణి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తి - 14కు చేరిన పాజిటివ్ కేసులు
Covid jn1 Cases in Telangana : తాజాగా కరోనా వేరియంట్ జేఎన్.1తో (Covid jn1 Cases) ప్రమాదం లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉషారాణి సూచించారు. ఆస్తమా, క్రానిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ), గుండెవ్యాధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ధూమపానం చేసేవారు, హెచ్‌ఐవీ, క్యాన్సర్ బాధితులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఉషారాణి వివరించారు.
న్యుమోనియా లక్షణాలు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- బలహీనం, నీరసం
- వికారం, వాంతులు, విరోచనాలు
- కఫంతో దగ్గు
- చలి, వణుకుతో జ్వరం
- ఛాతీలో నొప్పి
కరోనా లక్షణాలు
- ఒళ్లు నొప్పులు
- దగ్గు, గొంతులో నొప్పి
- సాధారణ జ్వరం
- ముక్కు కారడం
Covid cases in Telangana : మరోవైపు తెలంగాణలో కొవిడ్ మళ్లీ పంజా విప్పుతోంది. నిన్న 925 మందికి పరీక్షలు చేయగా 6 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొత్త వేరియంట్ బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.
Telangana Covid Cases: మళ్లీ పెరుగుతున్న కేసులు.. నాలుగో వేవ్‌కు సంకేతమా
కొత్త వేరియంట్‌తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు