ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కొవిడ్ 19) వైరస్ తాకిడి దేశీయ వైద్యరంగానికీ తగులుతోంది. మన దేశంలో వైద్యసేవల్లో వినియోగిస్తున్న ముఖ్యమైన 58 రకాల ఔషధ ఉత్పత్తులకు ఆటంకం ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఈ ఔషధాల్లో వినియోగించే ముడిసరకును చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం. వీటిలో క్లిష్ట దశలో వైద్యసేవల్లో వినియోగించే యాంటీ బయాటిక్స్‌తో పాటు విటమిన్, హార్మోన్ మందులే అధికంగా ఉన్నాయి. సమస్యను గుర్తించిన కేంద్రం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది.
ప్రస్తుతం చైనా నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిపిన నేపథ్యంలో ముడిసరకుల నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో అత్యవసరంగా అన్ని రాష్ట్రాలూ వెంటనే సోదాలు నిర్వహించాలని కొన్ని మార్గదర్శకాలిస్తూ కేంద్రం తాజాగా ఆదేశించింది. కృత్రిమ కొరత సృష్టించకుండా కఠినంగా నిఘా ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాలతో రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారులు తెలంగాణలో ఔషధ ఉత్పత్తులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కేంద్రం ఉత్తర్వులు ఇవీ
- గత ఏడాది నుంచి ఈ ఏడాది జనవరి వరకూ ఆయా ఔషధాల ఉత్పత్తి ఎంత ఉంది?
- వాటికి అవసరమైన ముడిసరకు మోతాదు? దిగుమతి? దాని ఖరీదు?
- కరోనా విజృంభించడానికి ముందు.. ప్రస్తుతం ధరల్లో వ్యత్యాసం ఉందా? అనేది కచ్చితంగా పరిశీలించాలి.
- ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముడిసరకు నిల్వలెంత ఉన్నాయి? ఉత్పత్తయిన ఔషధానికి విపణిలో గరిష్ఠ చిల్లర ధర ఎంత? ఇది గత ఏడాది నవంబరులో ఎంతుంది?
4 నెలల వరకూ ఢోకా లేదు
ఉత్పత్తి సంస్థల వద్ద మాత్రమే కాకుండా టోకు కొనుగోలుదారు వద్ద కూడా పరిశీలనలు జరుపుతున్నామని తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్దేశించిన ధరల కంటే ఎవరైనా అధికంగా ఔషధాలను విక్రయిస్తున్నారా అనే అంశంపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు.
ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొని ధరలు పెంచడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే అలాంటివి గుర్తించలేదని.. కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రస్తుతానికి ఈ 58 రకాల ఔషధాల లభ్యతకు ఢోకా లేదని తేలిందన్నారు. మరో మూణ్నాలుగు నెలల వరకూ వీటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరకు ఉత్పత్తి సంస్థల వద్ద అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: బంగాల్పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్