జేఈఈ మెయిన్స్ పరీక్షకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. జనవరిలో జరిగిన మెయిన్-1తో పోల్చుకుంటే బీఈ/బీటెక్ సీట్లకు పోటీపడే వారి సంఖ్య 1.75 లక్షలు తగ్గింది. మొత్తం దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నా పోటీ పడే వారి సంఖ్య దాదాపు 2.60 లక్షలు తగ్గింది. తాజాగా జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) దరఖాస్తుల వివరాలను విడుదల చేసింది.
ప్రతి ఏటా జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించి అందులో ఏది ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని తీసుకొని ర్యాంకు కేటాయిస్తున్నారు. జనవరి పరీక్షకు బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్-1కు 9,21,261 మంది దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తులు మాత్రం 11,18,673. ఈసారి బీఈ/బీటెక్ కోసం పేపర్-1 రాసే వారి సంఖ్య 7,46,115కి తగ్గడం గమనార్హం. మొత్తం దరఖాస్తులు 8,58,273 మాత్రమే.
ప్రయోజనం లేదనుకుని...
మెయిన్-1లో కనీస ప్రతిభ చూపని వారు మళ్లీ రాసినా ప్రయోజనం లేదని భావించి రెండోసారి దరఖాస్తు చేయరని జేఈఈ శిక్షణ నిపుణులు చెబుతున్నారు. బీఆర్క్/బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 రాయాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి, తాజాగా ప్రయాణం చేసిన వివరాలు తదితరాలను నింపి ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి అందజేయాలి.
ఇదీ చూడండి: 'మరీ ఇంత దారుణమా... డబ్బు కట్టేవరకు చనిపోయారనే చెప్పరా..?'