రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ... బ్యాంకింగ్ రంగాన్ని కొవిడ్ కుదిపేస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న బ్యాంకర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు చనిపోగా... 671 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 188 మంది, భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన 104 మంది, ఇండియన్ బ్యాంకుకు చెందిన 80 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడా 56, పంజాబ్ నేషనల్ బ్యాంకు చెందిన 55 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.
దీనితో విధులకు హాజరుకావడానికి బ్యాంకర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవులు కూడా పెడుతున్నారు. హాజరైన వారు కూడా భయాందోళనతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. దూరం నుంచే ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు రాగానే సంబంధిత బ్యాంకు బ్రాంచి రెండు, మూడు రోజులు మూసివేస్తున్నారు. పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసిన తరువాత తిరిగి తెరుస్తున్నారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక