రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 5 రోజుల్లోనే దాదాపు 350 కేసులు నమోదు కావటం భయాందోళనలు సృష్టిస్తోంది. శనివారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 809కి చేరింది. వీరిలో ఇప్పటికే 186మంది కోలుకుని డిశ్చార్జి కాగా... 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 605మంది చికిత్స పొందుతున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో..
పెరుగుతున్న కేసుల్లో అత్యధికులకు మర్కజ్ సంబంధాలు ఉండటంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 448 మందికి కరోనా సోకగా.. వీరిలో 131 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో.. దాదాపు 60 శాతానికి పైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
ప్రత్యేక సమావేశాలు..
రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఫీవర్ సర్వైలెన్స్‌ని ఏర్పాటు చేసిన సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా జలుబు, జ్వరం, దగ్గు వంటివి తగ్గేందుకు ఎవరెవరు మందులు కొనుగోలు చేస్తున్నారో తెలుసుకుని అవసరమైతే వారికి కరోనా పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్‌లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు.. మున్సిపల్ కమిషనర్‌లు రాష్ట్రంలో ఉన్న ఔషధ సరఫరాదారులు, ఫార్మాసిస్టుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔషధ దుకాణాలలో జలుబు, జ్వరం, దగ్గుకి మందులు కొనుగోలు చేసే వారి వివరాలు.. ఫోన్ నెంబర్ తప్పక నోట్ చేయాలని ఆ వివరాలను సర్కారుకు అందించాలని కోరాలని సూచించింది. ఫలితంగా కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి.. వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయటంతో పాటు.. వారికి తగిన చికిత్స అందించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ఫలితంగా కేసులను తగ్గించవచ్చని భావిస్తోంది.
అప్రమత్తం..
మొత్తంగా రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పక లాక్డౌన్కి సహకరించాలని సర్కారు సూచిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు