రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గత నెల రోజుల్లోనే కేసుల సంఖ్య దాదాపు పదింతలు పెరిగిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అన్నిచోట్ల కరోనా విస్తరిస్తోంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగానూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగానూ కేసులుండేవి. ఇప్పుడు రెండుచోట్లా అదే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం ప్రారంభించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 99 ఆరోగ్య, తదితర కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. గతంలో రోజుకు 400-500 నమూనాలే సేకరించేవారు. ఇప్పుడు రోజుకు 6 వేల నుంచి 7 వేల నమూనాలు తీసుకుంటున్నారు. అందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇంట్లో ఉండే జయిస్తున్నారు
వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారు రంగారెడ్డి జిల్లాలో 6,128 మంది ఉన్నారు. మరో 5,183 మంది హోం ఐసోలేషన్ పూర్తిచేసుకొన్నారు.
పెరిగిన మరణాలు
నెల రోజుల్లో కేసులతోపాటు మరణాలూ పెరిగాయి. నెల రోజుల కిందట రంగారెడ్డి జిల్లాలో కరోనాతో 25 మంది చనిపోగా ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరుకుంది. సగటున రోజుకొకరు చొప్పున జులైలో 31 మంది కరోనాతో చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలోనూ...
మేడ్చల్ జిల్లాలోనూ కేసులు సంఖ్య భారీగా నమోదవుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 10,200కు చేరుకుంది. జిల్లాలో గ్రామీణ పరిధి తక్కువగా ఉండగా.. అక్కడా వైరస్ వ్యాప్తి భారీగానే ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా కేసులు.. 11 మంది మృతి