రాష్ట్రంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. మార్చి 2న తొలికేసు బయటపడ్డాక అత్యధికంగా శనివారం రికార్డు స్థాయిలో 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒక్క రోజులోనే 10 మంది మృత్యువాత పడ్డారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక ప్రజలు రోడ్లపైకి రావడంతో నిత్యం కేసులు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలతో ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. వైరస్‌వ్యాప్తి నియంత్రణ, మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రాథమిక వైద్యకేంద్రాలకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు అందజేయాలని నిర్ణయించింది.
తొలి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు వస్తున్నా.. శనివారం అత్యధికంగా 152 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో కొన్ని రోజులుగా కేసులు తక్కువగా ఉన్నా.. తాజాగా అక్కడా పెరుగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి (10), మేడ్చల్ (18) జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో నమోదవుతున్నాయి. నిర్మల్, యాదాద్రి, మహబూబ్‌నగర్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని 83 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇంకా 1663 మంది చికిత్స పొందుతున్నారు.
123కి చేరిన మరణాలు
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో పది మంది కన్నుమూశారు. వీరందరికీ పాజిటివ్ వ్యక్తుల నుంచి కరోనా సోకింది. ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. వారిలో 74 ఏళ్ల వృద్ధుడు, 70 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. సనత్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి పాజిటివ్‌తో గత నెల 23న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన 39 ఏళ్ల వ్యక్తి పది రోజులుగా చికిత్స పొందుతూ చనిపోయారు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చేరిన రెండు, మూడు రోజుల్లోనే ఆరోగ్యం విషమించి మృత్యుఒడికి చేరారు.
మరణాలు, కేసులు పెరుగుతుండటంతో వైద్యఆరోగ్యశాఖ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తూ, సొంత వైద్యం తీసుకోవడం మానేయాలని కోరింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
అధికారులతో సమీక్ష...
కరోనా కేసులు పెరగడంతో మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించే విషయమై చర్చించారు. రాష్ట్రంలో కొన్నిరోజులుగా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల్లోనూ వైరస్ ఉద్ధృతిని గుర్తించారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు అందించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు.
అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఐసీఎంఆర్ ఆమోదించిన హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్లాస్మా థెరపీతో పాటు యాంటీవైరల్ డ్రగ్స్‌ను వినియోగించే విషయమై చర్చించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. రోగుల ప్రాణాలు రక్షించేందుకు రాష్ట్రంలోనూ యాంటీవైరల్ డ్రగ్స్‌ను అనుమతించాలని కోరగా, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఈటల తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా