తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 1009కి చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నయమైన 42 మంది మంగళవారం ఇంటికి పంపినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వారితో కలిపి.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 374 కి చేరిందని వివరించారు. వైరస్‌తో 25 మంది మృతిచెందారన్న అయన అత్యధికులు 60 ఏళ్ల పైబడినవారేనని స్పష్టంచేశారు. పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను వ్యాధి బలితీసుకున్నట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారమే పరీక్షలు
రాష్ట్రంలో కరోన పరీక్షలు చేయడం లేదంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేందర్.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కేసులను దాచిపెడుతున్నారన్న విమర్శలను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని ఈటల వివరించారు. మరణాలు లేకుండా.. మే 8 వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం అవుతుందని మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాజీవనం యధావిధిగా కొనసాగి... రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కేసుల తగ్గుదలకు... వస్తున్న ఫలితాలే నిదర్శనమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్నా... రాష్ట్రంలో తగ్గుతున్నాయని తెలిపింది.
ఇవీచూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు