కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ... అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని... డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
2020లో వేయాల్సిన నోటిఫికేషన్ను ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యం చేయడంతో... దరఖాస్తు చేయలేక నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ, మంత్రులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖలోని కానిస్టేబుల్స్ పోస్టులకు గతంలో 35 ఏళ్ల వయోపరిమితి ఉంటే... ఇప్పుడు 30ఏళ్లకే కుదించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.