పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికతోపాటు పుర ప్రజలకు ఆకర్షనీయమైన హామీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ మాకంరెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో 11మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. అన్ని వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో అంశాలపై దృష్టి సారించారు.
ఇప్పటికే కమిటీ రూపకల్పన చేసిన ముసాయిదా మేనిఫెస్టో పీసీసీకి అందగా ఆయా అంశాలపై మంగళవారం చర్చించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకోడానికి రూ. 9 లక్షల గ్రాంటుతో 150 చదరపు గజాలు స్థలం ఉచితంగా ఇవ్వడం, వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని మున్సిపాలిటీల్లో ఎంఎన్‌ఆర్‌జీఏ అమలు చేయాలని సూచించింది. ప్రతి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రి, ఐదెకరాల స్థలంలో జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణం, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, శ్మశానవాటికలకు పదెకరాల స్థలం ఏర్పాటు చేయాలని సూచించింది.
ఆధునిక వసతులతో ధోభీఘాట్ల నిర్మాణం, క్షురుకులకు షాపుల ఏర్పాటుకు ఉచితంగా స్థలం, కుమ్మరి సంఘాలకు పదెకరాల స్థలం, ఉపాధికి నైపుణ్య అభివృద్ధి సంస్థల ఏర్పాటు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేక రవాణా బోర్డుతోపాటు ఉచిత వైద్యం, కుటుంబానికి ఆరోగ్య బీమా, గిరిజన మున్సిపాలిటీల్లో గిరిజన సంస్కృతిని కాపాడేందుకు చర్యలు తదితర అంశాలను మేనిఫెస్టో కమిటీ ముసాయిదాలో చేర్చింది. పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు, పార్టీ అధిష్ఠానం అనుమతితో తుది మేనిఫెస్టో రూపకల్పన చేస్తుంది.
ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు