రాష్ట్రంలో మినీ పురపాలక పోరులో ఎన్నికలు జరుగుతున్న రెండు నగరపాలక సంస్థలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్ధుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్నింటిపై పర్యవేక్షణ నిమిత్తం రెండు ప్రత్యేక కమిటీలను వేసింది. రెండు నగరపాలక, అయిదు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనుండడం వల్ల.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసింది. అయిదు పురపాలక సంఘాల ఎన్నికల బాధ్యతలు స్థానిక, జిల్లా ముఖ్య నేతలకు అప్పగించింది. మినీ పురపోరుపై ఇటీవల కాంగ్రెస్ ముఖ్యనేతలు అంతర్గత సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యనేతలు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొండా దంపతులు మరికొందరు సీనియర్ నేతలు ఎన్నికల కార్యాచరణపై ప్రాథమికంగా చర్చించారు.
నాయకుల చేత నామినేషన్లు
అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అంతా స్థానిక నేతలకే వదిలిపెట్టారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు అనంతరం.. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్‌కు ముందే మినీ పురపోరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థుల ఎంపిక నిమిత్తం కసరత్తు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో స్థానికంగా బలమున్న నాయకుల చేత నామినేషన్లు వేయించారు. ఇటు వరంగల్, అటు ఖమ్మం నగరపాలక సంస్థల్లో... వందకుపైగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా బాగా పట్టున్న అభ్యర్థులు, పార్టీకి బలమున్న స్థానాలను గుర్తించి వాటిల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లనుంది.
కమిటీలో ముఖ్య నేతలు
ఇప్పటికే వరంగల్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కన్వీనర్‌గా, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కో కన్వీనర్‌గా, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ సహా ముఖ్యనేతలతో పీసీసీ కమిటీని వేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కన్వీనర్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ సహా.. జిల్లా ముఖ్య నేతలకు కమిటీలో స్థానం కల్పించింది.
సమస్యలే ప్రచార అస్త్రాలు
ఇవాళ, రేపట్లో కమిటీలు ఆయా నగరపాలక సంస్థల్లో మకాం వేసి... నామినేషన్ల ఉపసంహరణ, బీఫాంల జారీ... ప్రచార వ్యూహాలు తదతర అంశాలపై దృష్టి సారిస్తాయని పీసీసీ వెల్లడించింది. ఇవన్నీ స్థానిక ఎన్నికలు అయి నందున... స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ స్పష్టం చేసింది. స్థానిక సమస్యలే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఎంచుకుని ముందుకెళ్లనుంది. సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేటల్లో పూర్తి స్థాయిలో స్థానిక, జిల్లా ముఖ్యనేతల నేతృత్వంలోనే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించడం వల్ల స్థానిక నాయకులే పార్టీ పరిస్థితులను సమీక్షించుకుని ముందుకు వెళ్లనున్నారు.
ఇదీ చూడండి : మార్కెట్లలో కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యం... తప్పదు భారీ మూల్యం