Congress Party Candidate Followers Concern : రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల ప్రకంపనలు రేపుతోంది. జాబితాలో పేరు లేకపోవటంతో ఆశావహులు భగ్గుమన్నారు. పటాన్‌చెరు టికెట్ కాట శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కకపోవడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జాబితా బయటకు రాగానే తమ నాయకుడికి టికెట్ రాలేదని తెలుసుకున్న ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.
ఉదయం నుంచి శ్రీనివాస గౌడ్ అనుచరులు జూబ్లిహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద, గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీనివాస్ గౌడ్.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ లోపలికి వచ్చిన కొందరు శ్రీనివాస్ గౌడ్ మద్దతుదారులు... గాంధీభవన్ మెట్ల వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గాంధీభవన్‌లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
MLA Ticket Dispute in Congress : ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ తనకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. వనపర్తి టికెట్ తనకు ఇచ్చినట్లే ఇచ్చి.. తిరిగి మార్పు చేయడాన్ని మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు(Congress Gandhi Bhavan) వచ్చిన ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపాలని అనుచరులకు సర్దిచెప్పారు.
సత్తుపల్లి నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మానవతా రాయ్.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(Congress General Secretary) పదవికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. 24 గంటల్లోగా పునరాలోచన చేసి ఇతర నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల పేరు మార్చినట్టు తనకు బీ-ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెబెల్ అభ్యర్థిగా నామినేషన్(Nomination) వేస్తానని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చటంపై తుడుందెబ్బ ఆందోళన చేపట్టింది.
వన్నెల అశోక్‌కు కేటాయించి.. ఆడె గజేందర్‌కు మార్పు చేయటాన్ని నిరసిస్తూ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా అశోక్ వర్గీయులు బోథ్‌లో ఆందోళన చేశారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించామన్న రేవంత్‌రెడ్డి ప్రకటన నియోజకవర్గంలో చిచ్చురేపింది. వామపక్షాలకు టికెట్ ఇచ్చినా.. తాను మాత్రం పోటీలో ఉంటానని కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ స్పష్టం చేశారు.
Ticket Clashes in Telangana Congress : కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసమ్మతి సెగలను చల్లార్చేందుకు ఏఐసీసీ పెద్దలు.. ఆశావహులను తొందరపడొద్దని అదే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం(Party Leadership) చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళ, బుధ వారాలలో అభ్యర్థుల మార్పు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుజ్జగింపులతో సర్దుబాటు చేసి అక్కడ కలిసి పనిచేసేట్లు ఉన్న అభ్యర్థులతోనే సరిపెట్టడమా లేక మార్పు చేయడమా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థుల గెలుపుకు అవకాశం ఉంటుందని భావిస్తే మార్పు చేస్తారని.. అదంతా ఏఐసీసీ(AICC) స్థాయిలో జరుగుతోందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
గొప్పల కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల కోసం మీరు ఆలోచిస్తున్నారా: పొంగులేటి