దుబ్బాక, నాగార్జునసాగర్‌లో పని చేసినట్లుగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Komatireddy venkat reddy) విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వాస్తవ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరిస్తానని ఆయన తెలిపారు. ఇవాళ జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ఆయన స్పందించారు.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ఒక్క సభ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి క్యాడర్ ఉందని తెలిపారు. కార్యకర్తలను తమవైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నించలేదని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: