హరితహారం... పచ్చదనానికే పరిమితం కాకుండా ఉపాధి కల్పనకూ వినియోగపడేటట్లు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండలిలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో (telangana monsoon assembly session 2021) ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. రహదారికి ఇరువైపులా వెదురు బొంగు మొక్కలను నాటాలని తద్వారా రహదారికి రక్షణ ఏర్పడుతుందన్నారు. హరితహారం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతికినట్లు ప్రభుత్వం చెబుతోందని.. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ చేసినట్టుగా చెబుతున్నా.. అటువంటిది ఎక్కడా కనిపించడం లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
అంత వ్యత్యాసం ఎందుకు..
2016 -17లో 31.67 కోట్ల మొక్కలు ( Haritha haram) నాటేందుకు రూ.738 కోట్లు, 2017-18లో 60 కోట్ల మొక్కలు నాటడానికి రూ.739 కోట్లు, 2020-21లో 33.43 కోట్ల మొక్కలు నాటేందుకు రూ.1,389 కోట్లు లెక్కన ఖర్చుచేసినట్లు చూపించారని వీటి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు (telangana monsoon assembly session 2021)వచ్చిందని నిలదీశారు. హరితహారం కార్యక్రమానికి మొత్తం రూ.6,550 కోట్లు ఖర్చుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్న జీవన్‌రెడ్డి.. అందులో కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంత, ఎన్ఆర్జీఎస్ నిధులు ఎన్నో వెల్లడించాలని కోరారు.
ఆయుష్మాన్ భారత్ అమలన్నారు.. కదా ఏమైంది..
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేస్తామని.. ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడ అటువంటి దాఖలాలు లేవన్నారు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. ఆ పథకాన్ని ఎలా అమలుచేస్తారు.. ఎప్పటి నుంచి అమలుచేస్తారో చెప్పాలని కోరారు. కరోనా చికిత్స (corona treatment), డెంగీ వంటి విషజ్వరాలకు సంబంధించిన చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. వైద్యానికి భారీగా ఖర్చుచేయలేక.. పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యావాలంటీర్లను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పీసీఆర్ సమస్యలను ప్రస్తావించిన జీవన్‌రెడ్డి.. ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో 8 వేల మంది క్షేత్రస్థాయి సహాయకులను (field assistants) తొలగించడం దురదృష్టకరమని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'హరితహారం అందరూ హర్షించదగ్గ కార్యక్రమం. ఇందులో మొక్కలు నాటేందుకే పరిమితం కాకుండా సమాజానికి ఏవిధంగా మేలు చేస్తుందో చూడాలి. ఫల వృక్షాలు నాటేలా చొరవ తీసుకోవాలి. ఫలితంగా సంబంధిత వర్గాలకు ఉపాధి దొరుకుతుంది. రోడ్లకు ఇరువైపులా వెదురు చెట్లు నాటితే.. ఆక్రమణలకు అవకాశం లేకుండా ఉంటుంది. వెదురు చెట్ల వల్ల సంబంధిత కులాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే మొక్కలకు జీయో ట్యాంగింగ్ చేసినట్లు చెబుతున్నారు. అటువంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు.'
- జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఇదీచూడండి: Telangana CM KCR : 'తెలంగాణ పర్యాటక ప్రగతిని పరుగులు పెట్టిస్తాం'