Congress MLA Candidates 3rd List Telangana : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 19 స్థానాల విషయంలోనూ దాదాపుగా కొలిక్కి వచ్చింది. వామపక్షాలు ప్రతిపాదించిన 4 నియోజకవర్గాలతో పాటు మరో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. రెండో జాబితా వేళ చెలరేగిన అసమ్మతిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి ముందుగానే అప్రమత్త చర్యలు చేపట్టింది.
Telangana congress MLA Tickets 2023 : కాంగ్రెస్ ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో కొత్తగూడెం, చెన్నూరు, వైరా, మిర్యాలగూడ నియోజకవర్గాలను వామపక్షాలకు ఇవ్వాలని గతంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో ఈ స్థానాల్లోనూ గెలిచే సత్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులనే బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్‌తో ఇక తమకు పొత్తు ఉండదని స్పష్టం చేసిన సీపీఎం.. 18 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పోటీచేయని చోట బీజేపీ యేతర పార్టీలకు మద్దతిస్తామని ప్రకటించింది.
Telangana Assembly Elections 2023 : సీపీఐకి కేటాయించాలనుకున్న కొత్తగూడెం, చెన్నూరులోనూ తమ అభ్యర్థులనే బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీకి జలగం వెంకట్రావు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ వివేక్.. చెన్నూర్ నుంచి పోటీకి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైరా నుంచి బరిలో దించేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దతుదారులు విజయభాయ్‌ని పోటీలో నిలబెట్టే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న బి. లక్ష్మారెడ్డికి నిలబెట్టినట్టైతే గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇలా.. గతంలో సూత్రప్రాయంగా నిర్ణయించిన 4సీట్లలోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 4 స్థానాలు కాకుండా కాంగ్రెస్ ప్రకటించాల్సిన వాటిలో జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, నారాయణఖేడ్, పటాన్‌చెరు, చార్మినార్, సూర్యాపేట, తుంగతుర్తి ,డోర్నకల్, ఇల్లందు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలున్నాయి. ఈ 15 స్థానాల్లో దాదాపు అన్నింటికి అభ్యర్థుల ఎంపిక పూర్తైందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
'బీజేపీ బీఆర్ఎస్లకు బీసీలకు అధికారం ఇవ్వడం నచ్చదు అందుకే కుల గణనకు రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదు'
Congress MLA Candidates 2023 : వీరిద్దరిలో ఒకరికి పార్లమెంటు సీటిస్తామని సర్దిచెప్పినట్టు సమాచారం. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ దృష్ట్యా.. ఇక్కడి నుంచి షబ్బీర్ అలీ వెనుకడుగు వేస్తునట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఎవరిని నిలపాలన్న దానిపై చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కామారెడ్డి నుంచి పోటీ విషయమై ఏఐసీసీ అనుమతించాల్సి ఉంది. మరోవైపు.. తీన్మార్ మల్లన్నను పార్టీలోకి తీసుకొచ్చి తుంగతుర్తి లేదంటే కామారెడ్డి నుంచి పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులకు తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని కొంతమంది ప్రతిపాదిస్తండగా.. అద్దంకి దయాకర్‌ను మళ్లీ బరిలో దించాలని ఇంకొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేని తట్టుకొని నిలబడగలిగిన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేటసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల రెండో తేదీన మూడో జాబితా ప్రకటించాల్సి ఉండగా.. వివిధ కారణాలతో జాప్యం కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో పరిణామాలు, పోటీచేస్తామని కమ్యూనిస్టులు చెబుతుండటాన్ని బట్టిచూస్తే రెండు పార్టీలు తెగతెంపులు చేసుకునే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది. ఈ పొత్తు విషయమై మాట్లాడేందుకు ఏఐసీసీ నియమించిన భట్టి విక్రమార్క కమిటీ ప్రయత్నిస్తుండడంతో మూడో జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు పీసీసీవర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గింది : నీతీశ్ కుమార్