నవంబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని నాయకులకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ సూచించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో మొదలైన పార్టీ ముఖ్యుల సమావేశంలో ముఖ్య అతిథులుగా మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వాన్ని ఏవిధంగా చేయాలి, ఎవరెవరిని భాగస్వామ్యం చేయాలి తదితర అంశాలపైనే చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏవిధంగా చేపట్టాలో.. ఠాగూర్ నాయకులకు వివరించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు జగ్గారెడ్డి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, కుమార్ రావ్, సురేష్ కుమార్ షెట్కార్, జఫ్ఫార్ జవీద్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14వ తేదీ నుంచి జరగనున్న జనజాగరణ కార్యక్రమాలపై కూడా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ.. నవంబర్ 14 నుంచి ఏడు రోజుల పాటు జన జాగరణ పాదయాత్ర నిర్వహించనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి అందరూ ఈ పాదయాత్రలో పాల్గొంటారని వివరించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు ఉత్సవాలను జరుపుకోవడానికి ఒక కమిటీ వేస్తామన్నారు. నవంబర్ 9, 10 తేదీలల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను త్వరలో నియమిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి:
congress meeting: నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. హాజరు కానున్న మాణిక్కం ఠాకూర్