Latest Political Developments in Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి నదీమ్ జావిద్.. టీపీసీసీలో చోటుచేసుకున్న తాజా ఘటనలపై ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌కు నివేదించినట్లు సమాచారం.
అయితే.. అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలతో సమావేశం కావాలని ముగ్గురు కార్యదర్శులను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ ఆదేశించారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ హైదరాబాద్‌లో ఉండగా.. మిగిలిన ఇద్దరు బోసురాజు, రోహిత్ చౌదరిలు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఇవాళ సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పార్టీకి ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు 'సేవ్ కాంగ్రెస్' నినాదంతో ముందుకు వెళుతున్న అసంతృప్తి నేతలు మరోసారి ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసంలో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: