New PCC committees: ఏఐసీసీ ప్రకటించిన వివిధ కాంగ్రెస్ కమిటీల కూర్పుపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. పదవులు వచ్చిన వారు.. రాని వారు ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారు. కమిటీల్లో ఎక్కడో ఒకచోట అవకాశం దక్కించుకున్నప్పటికీ.. ప్రాధాన్యం లేని వారితో కలిసి ఇచ్చారన్న భావనతో కొందరు ఉన్నారు. తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ పీసీసీ కార్యనిర్వహక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కొందరు ముఖ్యుల పేర్లు కూడా తొలిగిపోయాయి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కూడా సురేఖ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కలేదని బెల్లయ్య నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యులను కుదించే క్రమంలో.. కొందరు ముఖ్యుల పేర్లు కూడా తొలిగిపోయాయి.
గతంలో పీఏసీలో సభ్యుడిగా ఉన్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేరు తాజా కమిటీలో గల్లంతయ్యింది. దీంతో ఆయన తీవ్ర అంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా తాను ప్రతిపాదించిన పేరు కాకుండా మరొకపేరు రావడంతో మహేశ్వర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీఎల్పీని భాగస్వామ్యం చేస్తే బాగుండేది: కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలున్న కార్యనిర్వహక కమిటీ జాబితాలో సీనియారిటీ పరంగా పేర్లు పెట్టకపోవడంపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి.. ఓయూ నేతలు సమావేశం నిర్వహించారు. కమిటీల కూర్పు కసరత్తులో సీఎల్పీని భాగస్వామ్యం చేస్తే బాగుండేదని భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు.
రేపు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు సమావేశం: మరోవైపు మంగళవారం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో సమావేశం ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు సమావేశం కానున్నారు. అనర్హులకు చోటు కల్పించారనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు 26 జిల్లాలకే డీసీసీలను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. మరో 9 డీసీసీలను పెండింగ్‌లో ఉంచింది. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించిన వారిని కాకుండా.. మరొకరికి ఇవ్వాలని ఇతర సీనియర్ నాయకులు ప్రతిపాదించడంతో పక్కన పెట్టారు.
మరో 9 డీసీసీలను పెండింగ్‌లో ఉంచిన ఏఐసీసీ : అదే విధంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిని అలాగే ఉంచాలని పలువురు సీనియర్లు పట్టుబడుతుండడంతో తాత్కాలికంగా నిలిపేశారు. సూర్యాపేట, జనగామ, వరంగల్ ఈస్ట్, ఆసిఫాబాద్, భూపాల్‌పల్లిలు ఇదే కారణంతో ఆగినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మలనే అయినా పెండింగ్‌లో పెట్టారు. మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెరెళ్ల శారద, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలు అధికార ప్రతినిధులుగా ఉండగా.. ఆ ఇద్దరికి ఉపాధ్యక్షుల స్థానంలో కూడా సభ్యులుగా అవకాశం కల్పించారు. ప్రధాన కార్యదర్శుల నియామకంలో క్రమపద్దతి లేకుండా పోయిందని పార్టీలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
"ప్రతిసారి కమిటీల కూర్పు సమయంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరితోపాటు ఏఐసీసీ నాయకులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఈసారి కమిటీ ఏర్పాటుకు నన్ను ఎందుకు పిలవలేదో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ను అడిగితే తెలుస్తుంది. కమిటీకి చెందిన నన్ను అడిగితే చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడిని. పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడు ఇద్దరూ ముఖ్యమే." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి: పీసీసీ కొత్త కమిటీలపై ముదురుతున్న అసంతృప్తుల లొల్లి
పీసీసీ ఈసీ సభ్యురాలిగా కొండా సురేఖ రాజీనామా.. ఆ పదవి ఇస్తానని రేవంత్ హామీ