రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్ సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఆల్ ఇండియా ఫ్రొఫెషనల్స్ కాంగ్రెస్ సౌతిండియా శాఖ ఛైర్మన్ గీతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో రవికుమార్ అనే కోరనా బాధితుడు ఛాతి ఆస్పత్రిలో తన కుటుంబానికి వీడ్కోలు పలికిన వీడియో హృదయ విదారకమైనదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల సంఖ్య పెంచడంలో ప్రభుత్వం సరైన విధానాలు పాటించడం లేదని ఆరోపించారు.
మార్చి 31 నాటికి రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ ప్రయోగశాలలు ఉండగా.. ఇప్పటికీ ఏడు పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మొదట్లో 132 ప్రయోగశాలలు ఉండగా అవి ఇప్పుడు 760కి పెరిగాయని, తెలంగాణలో మాత్రం.. కేవలం ఒక్కటే పెరగడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. హైదరాబాద్ , వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, గద్వాల్ జిల్లాలు మాత్రమే ప్రయోగశాలలు ఉన్నాయన్నారు. జూన్ 28వ తేదీ నాటికి తెలంగాణలో 82,458 పరీక్షలు చేయగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో 8.7 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్, మీడియా, ప్రతిపక్షాలు అందరూ కొవిడ్ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్కు కనువిప్పు కలిగించాలని కోరారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా