Congress Hath Se Hath Jodo Abhiyaan Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన వెంటనే.. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకూ చేరవేయడానికి వీలుగా.. ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం కొంతకాలంగా సన్నాహక సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే.. నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు.
రేవంత్ రెడ్డి 6 నెలల పాటు.. 126 రోజులు పాదయాత్ర నిర్వహించాలని యోచించినప్పటికీ.. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమోదం లభించలేదు. ఇప్పటికీ హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌కు.. పరిమితం కావాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జూడో యాత్ర ఈనెల 30 వరకు కొనసాగనుండడంతో.. ఈనెల 26న లాంఛనంగా ప్రారంభించి కొన్ని రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయించింది.
కశ్మీర్‌లో ఈనెల 30న జరగనున్న ముగింపు కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీనియర్ నాయకులు హాజరు కావాల్సి ఉండడం.. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్, 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉండడంతో.. వాటిని పరిగణలోకి తీసుకుంది. వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి.. అక్కడి నుంచే హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌కు శ్రీకారం చుట్టాలని.. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం తీర్మానించింది.
Hath Se Hath Jodo Abhiyaan Yatra:బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి.. జోడో యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభించాలన్న తదితర అంశాలపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టాలని భావించినప్పటికీ.. కొందరు నాయకులు అభ్యంతర వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి మొదలు పెట్టాలని యోచించినప్పటికీ.. ఆయా ప్రాంతాలల్లో నాయకులు అడ్డు తగిలినట్లు తెలుస్తోంది.
దీంతో ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలన్న అంశంపై.. ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే హాథ్ సే హాథ్ జోడో యాత్ర రెండు నెలలపాటు కొనసాగడంతో నాయకులు కార్యకర్తలు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ వైఫల్యాలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. విస్తృత స్థాయి సమావేశంలో.. సీనియర్ నాయకులంతా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని మాజీ మంత్రి కొండా సురేఖ కోరారు. ఆమె వ్యాఖ్యలపై అభ్యంతర వ్యక్తం చేసిన మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలాంటి ఏవైనా ఉంటే నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని.. ఇది వేదిక కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత పీసీసీ అనుబంధ విభాగాలతో సమావేశమై.. యాత్రలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: