Congress Govt Focuses on Telangana Economy : కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఆదాయ వ్యయాలపై లెక్కలు సిద్ధం చేస్తోంది. రాబడి, వ్యయం, రుణాలు వాటి ఖర్చుల్ని శాసనసభలో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి(Telangana Economy) వివరించి గ్యారంటీ హామీల అమలుకు చట్టం తీసుకురావాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకూ రాష్ట్ర బడ్జెట్ల(Telangana Budget)ను విశ్లేషించిన రిజర్వుబ్యాంకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి రూ.3.52 లక్షల కోట్ల అప్పులున్నట్లు తెలిపింది.
Telangana Economy 2023 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను ఇప్పటికే మార్కెట్ల నుంచి నాటి కేసీఆర్ సర్కార్ సేకరించింది. ఇవికాకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు గ్యారంటీ సైతం ఇచ్చింది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం అప్పుల భారం రూ.5 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు కొత్త ప్రభుత్వం చెబుతోంది. వీటిపై నెలనెలా వడ్డీ రూపంలో భారీగా చెల్లించాల్సి వస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(Financial Year2023) ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు రూ.12,956.52 కోట్లను వడ్డీల కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు కాగ్ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే కాలానికి చెల్లించింది రూ.11,734.06 కోట్లు. పెరిగిన ఆర్థిక భారం రూ.1,222.46 కోట్లు. ఇలాగే జీతభత్యాలు, పింఛన్లకు చెల్లించాల్సిన మొత్తం ఏటా ఎటూ పెరుగుతూనే ఉంటుంది.
Telangana Budget 2023-2024 : ప్రస్తుత ఏడాదిలో మొత్తం రూ.2.59 లక్షల కోట్ల ఆదాయం రావొచ్చని రాష్ట్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకూ రూ.2.16 లక్షల కోట్లు వచ్చింది. ఈ లెక్కల్లో అప్పుగా తీసుకున్న సొమ్ము, కేంద్ర గ్రాంట్లు(Central grants) కూడా కలిసి ఉన్నాయి. వచ్చే మార్చి వరకూ అప్పులు తీసుకోవడానికి పెద్దగా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరముందని ఆర్థికశాఖకు ప్రభుత్వం నిర్దేశించింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, అమ్మకపు పన్నుల ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లపైనా ఆశలు పెట్టుకుంది.
ఈ ఏడాది రూ.41,259.17 కోట్ల వరకూ అలా రావొచ్చనేది అంచనా కాగా అక్టోబరు నాటికి వచ్చింది రూ.3,835.91 కోట్లే. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లన్నీ రాకపోతే బడ్జెట్ ఆదాయ లక్ష్యాల సాధన అనుమానమేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ లెక్కలన్నీ అసెంబ్లీ(Assembly Sessions)లో వివరించి ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2014 నుంచి ఆదాయ, వ్యయాలపై ఇప్పటివరకూ ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం తయారు చేసి, సమావేశాల్లో ప్రకటించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
ప్రభుత్వం కీలక నిర్ణయం - ఎన్నికలకు ముందు మంజూరై ఉన్న, ప్రారంభం కానీ పనుల నిలిపివేత
విద్యుత్ రంగంపై దృష్టి : రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితులపైనా అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.81,516 కోట్లు, నష్టాలు రూ.50,275 కోట్లు ఉన్నట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. ఇవి కాకుండా రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలకు, ఎత్తిపోతల వంటి పథకాలకు వాడుకుంటున్న కరెంటుకు నెలనెలా బిల్లు చెల్లించకపోవడంతో అవి కొండలా రూ.28,861 కోట్లకు చేరాయని విద్యుత్ సంస్థలు నివేదించాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టాం - అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు