స్థానిక సంస్థల కోటాలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Elections) పోటీ చేసే విషయంపై ఆచితూచి అడుగు వేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నిర్ణయించింది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో స్థానిక సంస్థల్లో పార్టీకి ఉన్న బలం(ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు), ఆశావహుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనకు వచ్చింది. ఈ నెల 16న (మంగళవారం) సాయంత్రం లోగా తుది నిర్ణయం తీసుకోనుంది. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్యక్షతన సోమవారం జూమ్ యాప్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల మండలి ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అంశాన్ని చర్చించారు.
నల్గొండ విషయంలో.. జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. ఏ విషయమైనా సమగ్ర సమాచారాన్ని పీసీసీకి, ఎన్నికల కమిటీ సభ్యులకు, సీఎల్పీ నేతకు తెలియచేయాలని వారిని రేవంత్‌రెడ్డి కోరారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పోటీ చేసి ఓడిపోతే శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వీహెచ్ అభిప్రాయపడ్డారు. దీన్ని మిగతా నాయకులంతా సమర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, ఆయా జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయం తెలుసుకుని..నవంబరు 16న సాయంత్రంలోగా తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి
పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని రేవంత్ కోరారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. యువత భాగస్వాములయ్యేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఈ నెల 14 నుంచి జరగాల్సిన ప్రజా చైతన్య యాత్రలు వాయిదా పడిన నేపధ్యంలో జిల్లా ఇన్‌ఛార్జీలుగా నియమితులైన వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు.
ఇదీ చూడండి: