Congress VS BJP: కాంగ్రెస్-బీజేపీ మధ్య చిచ్చు రేగింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ. 25 కోట్ల రూపాయలు తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలతో.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రెండు పార్టీల మధ్య వర్డ్ వార్‌పై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ.. రేవంత్, ఈటల ఇద్దరూ తోడు దొంగలని విమర్శించింది.
బీఆర్ఎస్ నుంచి రూ. 25 కోట్లు తీసుకుంది నిజం కాదా: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 25 కోట్లు బీఆర్ఎస్ నుంచి తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రోజున మాట్లాడిన ఈటల.. బీఆర్ఎస్-కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసులాంటివేనని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలప్పుడు కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ. 25 కోట్లు వచ్చాయనేది నిజం కాదా అని ప్రశ్నించారు.
"బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రూ. 25 కోట్లు తీసుకోవడం నిజం కాదా.. బీఆర్ఎస్- కాంగ్రెస్‌లు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
ఈటలకు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి: మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 25 కోట్లు తీసుకుందన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఆరోపణల్ని నిరూపించాలని ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలదేనని, చందాలు వేసుకుని పనిచేశామని తెలిపారు. బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారన్న రేవంత్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం చార్మినార్ వద్ద ఆలయానికి వస్తానన్నారు. తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. ఈటల రాజేందర్ సిద్ధమా..? అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
బీజేపీ ఆడుతున్న ఆటలో బలిపశువు ఈటల : బీజేపీ ఆటలో బలిపశువుగా మారిన ఈటల రాజేందర్.. నిరాధార ఆరోణలు చేసి.. తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారని.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. "ఈటల రాజేందర్ నేడు బలి పశువులాగా కనిపిస్తున్నారు. ఉద్యమ నేతగా మీరంటే ఒక గౌరవం ఉండేది. ఇలాంటి పనికి మాలిన ఆరోపణలతో.. మీరూ సగటు రాజకీయ నాయకుడిలా మారారు. రూ. 25 కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్‌ను కొన్నారని అన్నారు. రూ. 18వేల కోట్లు ఖర్చు చేసి మా నేతను కొన్నారు." అని అద్దంకి మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయిన బీఆర్ఎస్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరు తోడు దొంగలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్.. రేవంత్‌రెడ్డికి రూ. 25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
"గత ఎన్నికల్లోనే చెప్పాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని. గత హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ఈటల రాజేందర్ రూ. 25 కోట్లను ఇచ్చారు. ఇద్దరూ దొంగలే. - పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: