Congress Activists Protest: హైదరాబాద్ భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏపీని కాంగ్రెస్ విభజించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్న ప్రధాని మోదీ... వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. మోదీకి భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భాజపా కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయం వెళ్లే దారిని పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపు తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసనలో పాల్గొన్నాయి.
రేవంత్‌రెడ్డి ఫైర్...
Revanth Reddy Fire on PM Modi: తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరుణ్‌జైట్లీని మేనేజ్ చేసి మోదీ పదవులు పొందారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని భాజపా తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. 1999లోనే తెలంగాణ ప్రాంతంలో భాజపా 4 ఎంపీ సీట్లు గెలిచిందన్న ఆయన... తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి వాజ్‌పేయి మోసం చేశారన్నారు. వాజ్‌పేయి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయి చూపారని గుర్తుచేశారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ