కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. జీడీపీ కనిష్ఠ స్థాయికి పడిపోగా...పరిశ్రమలు మూతపడి నిరుద్యోగల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 5 నుంచి 15 వరకు వివిధ నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.
ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షక ప్రతినిధిని పంపించి...నిరసన, ఆందోళన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకుంది. డీసీసీలు లేని చోట్ల పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఇతర సీనియర్ నాయకులను పీసీసీ... ఇంఛార్జీలుగా నియమించింది.
కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీకి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
గాంధీ భవన్‌కు రెండు వైపులా ఉన్న గేట్ల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ దాటి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చిన వారిని ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతంగా జరిగినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక విధానాల వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దివాళా తీశాయని పేర్కొంటూ గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం అందజేశారు.
ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా చేసే ఈ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.
- ఇదీ చూడండి : 'ముందస్తు అరెస్టులతో భావస్వేచ్ఛను హరిస్తున్నారు'