Concern Of Police Candidates For Appointments Under G.O 46 : రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. దీనిపై కొందరు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. జీవో వల్ల సమన్యాయమే కానీ ఎవరికీ నష్టం లేదని ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నియమాకాలు చేపడితే, అన్ని జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
TS Police Aspirants Support GO.46 : అన్ని జిల్లాల అభ్యర్థులకు సమన్యాయం జరుగుతుందని భావించి.. రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో 46ను ప్రవేశపెట్టిందన్నారు. ఇది కేవలం టీఎస్ఎస్పీ పోస్టులకు మాత్రమే అమలు అవుతుందని వివరించారు. ఈ జీవో వల్ల 33 జిల్లాలకు న్యాయపరమైన హేతుబద్ధీకరణ జరుగుతుందని.. ఉత్తర తెలంగాణకి 100 శాతం, దక్షిణ తెలంగాణకి 100 శాతం జిల్లాల్లో జనాభా ప్రాతిపదికనే పోస్టుల భర్తీని కల్పించటం జరిగిందన్నారు.
నిష్పత్తి ప్రకారం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ప్రతీ ఒక్క అభ్యర్థికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంత మంది కానిస్టేబుల్ అభ్యర్థులు.. జీవో 46 ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవోను రద్దు చేయాలని కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Implement GO. 46 : జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. చివరి క్షణంలో ఫలితాలు వచ్చే సమయంలో తమ పొట్టకొట్ట వద్దని తోటి కానిస్టేబుల్ అభ్యర్థులను వేడుకున్నారు. ఎన్నో అప్పులు చేసి, తిప్పలు పడి చదువుకుంటూ సాధించిన కొలువుకు ఎసరు పెట్టవద్దని.. జీవో కోసం అవగాహన లేకుండా కొందరు పెద్దలు వెనకుండి అభ్యర్థులను తప్పు తోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ జీఓను రద్దు చేయాలంటూ కొంతకాలంగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలు సాగిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. గతవారం వారు మూకుమ్మడిగా సచివాలయాన్ని సైతం ముట్టడించారు. జీవో నంబర్ 46ను రద్దు పరచలాంటూ నినదించి, ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తాజా జీఓ వల్ల గ్రామీణ ప్రాంతవాసులకు అన్యాయం జరుగుతుందంటూ చేస్తున్న వాదనలో అర్థం లేదని పోలీసులు ఆశావహులు మండిపడ్డారు. తక్షణమే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్యూర్మెంట్ బోర్డు జోక్యం చేసుకొని ఫలితాలు ప్రకటించాలని కోరారు.
ఇవీ చదవండి :