గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు.. ట్రేడ్ లైసెన్సులను మార్చి 31 లోపు రెన్యువల్ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. పునరుద్ధరణలో జాప్యం చేస్తే లైసెన్స్ ఫీజుకు అదనంగా అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 మధ్యలో రెన్యువల్ చేస్తే 25 శాతం, మే 31 నుంచి రెన్యువల్ దరఖాస్తులపై 50 శాతం అపరాధ రుసుముగా వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ లేని వారు నూతనంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100 శాతం జరిమానా విధించడంతో పాటు నెలకు 10 శాతం అదనపు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.
కొత్తగా ట్రేడ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్, ఇ- సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ వివరించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త ట్రేడ్ లైసెన్సులను పొందేందుకు కావాల్సిన సమాచారం కోసం జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ www.ghmc.gov.in ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యాపారులను కోరారు.
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ జరిమానా విధించడం సరైందే: మేయర్ విజయలక్ష్మి