రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండిస్తుది. అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతూ ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. గత నెలతో పోలిస్తే వాణిజ్య పన్నుల రాబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మద్యం అమ్మకాలపై రావల్సిన వ్యాట్‌లో ఏలాంటి మార్పు లేకపోగా ... పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ ఏకంగా 37శాతం వృద్ధి కనబరిచింది. గత ఆర్థిక ఏడాది మొదటి ఏడు నెలల్లో వచ్చిన రాబడుల మొత్తం రూ.22,845.96 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో రూ.37,018.29కోట్లు ఆదాయం వచ్చింది. అంటే ఏకంగా 62శాతం వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్ నెలలో వచ్చిన రాబడులను పద్దుల వారీగా గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చితే 44శాతం అధికంగా వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వృద్ధి నమోదు..
పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ ద్వారా గతేడాది అక్టోబర్‌లో రూ.727.64 కోట్ల ఆదాయం రాగా... ఈ సంవత్సరం రూ.993.55 కోట్ల రాబడి వచ్చి... ఏకంగా 37శాతం వృద్ధి కనబరిచింది. మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా గతేడాది అక్టోబర్‌లో రూ.1,200 కోట్ల రాబడి రాగా ఈ సంవత్సరం రూ.1,204.91 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే దాదాపుగా అయిదు కోట్లు అధికం. వస్తు సేవల పన్ను-జీఎస్టీ తీసుకుంటే అంతకు ముందు సంవత్సరం అక్టోబర్‌లో రూ.2,259 కోట్లు రాగా ఈ ఏడాది రూ.2,519.72 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిపై 12 శాతం అధిక రాబడి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
44 శాతం అధికం..
ఈ అక్టోబర్‌లో కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం కింద రూ.2,414.24 కోట్లు వచ్చింది. వీటన్నింటిని కలిపితే గత అక్టోబర్ నెలలో వ్యాట్, జీఎస్టీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రూ.7,132.42 కోట్లు. ఇది అంతకు ముందు ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.4,957.50 కోట్లకు 44శాతం అధికమని వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: Fake Documents : తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంకుకు రూ.15 కోట్లు టోకరా