తెలంగాణ ఆబ్కారీ శాఖ పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కొంతమంది అధికారులకు ఒకొక్కరికి నాలుగైదు పోస్టులు ఉండగా.. మరికొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఖాళీగా ఉంచి జీతాలు చెల్లిస్తున్నారు. పోస్టింగ్‌లు ఇచ్చే విషయమై ప్రభుత్వానికి ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పని చేసిన అనుభవంతో శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అవసరం లేని పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేశారు. ఆ తర్వాత ఎస్సై స్థాయి నుంచి అదనపు కమిషనర్ స్థాయి వరకు పదోన్నతులు లభించాయి. కానీ ప్రమోషన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా 60మందికిపైగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
నెలలు గడుస్తున్నా..
రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఏపీ నుంచి 2019లో వచ్చిన నలుగురు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఆబ్కారీ భవన్‌కే పరిమితం చేశారు. పోస్టింగ్‌ల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్న కోపంతో వీరిని పక్కన పెట్టారని, ఏడాదిపాటు వేతనాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రెండు మూడు నెలలకి ఒకసారి మూలవేతనం మాత్రం ఇస్తున్నారు. పోస్టింగ్‌లు లేకుండా వేతనాలు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించవు. వీరి జీతాల కోసం టీఏఎస్బీసీఎల్ నుంచి అప్పుగా తీసుకుని ఇస్తున్నారు. వీరు కాకుండా ఉన్నత స్థాయిలో 68 మందికి పదోన్నతులు లభించగా 12 మందికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇటీవల పోస్టింగ్‌లు ప్రభుత్వం ఖరారు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చకుండా కొంతమంది అడ్డుపడుతున్నట్లు ఆ శాఖలో చర్చ నడుస్తోంది.
పోస్టింగ్‌లు ఖరారై... అస్తవ్యస్త పాలనకు ఎపుడు తెరపడుతుందోనని ఆబ్కారీశాఖ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: RAINS IN HYD: భాగ్యనగరంలో కుంభవృష్టి.. జనజీవనం అస్తవ్యస్తం