Cold Effect on Telangana : రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు పెరుగుతున్న పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 4.6 డిగ్రీలు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది.
ఇవాళ, రేపు పగలు పొడిగా, రాత్రిపూట చలి వాతావరణం ఉంటుందని గాలిలో తేమ పేరిగి ఉదయం పూట అధికంగా మంచు కురుస్తోందని వాతావరణ శాఖ వివరించింది. ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తుడంటం వల్లే.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలితీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్తమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. మరికొందరు చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 8 గంటలతర్వాత పొగమంచు కొనసాగుతోంది. వచ్చే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో.. సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు.