Kadapa Steel Factory Foundation today : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద.. 2019 డిసెంబర్ 23న సీఎం జగన్ ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. 3,591 ఎకరాల్లో రూ.11,606 కోట్ల పెట్టుబడితో.. 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమను మూడేళ్లలో పూర్తి చేస్తామని బహిరంగ ప్రకటన చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. కానీ మూడేళ్లు దాటినా సున్నపురాళ్లపల్లె వద్ద శిలాఫలకం తప్ప ఒక్క పనీ జరగలేదు.
Kadapa Steel Factory news : ఈ మూడేళ్ల కాలంలోనే లిబర్టీ సంస్థ, ఎస్సార్ స్టీల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా.. ఆ సంస్థలు పనులు చేపట్టలేదు. తాజాగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.8,800 కోట్ల పెట్టుబడితో జమ్మలమడుగు వద్ద పరిశ్రమ నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. తొలిదశలో రూ.3,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఉక్కు పరిశ్రమకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
గతంలో శిలాఫలకం వేసిన ప్రాంతంలోనే ఉదయం 11 గంటలకు రెండోసారి భూమిపూజ చేయనున్నారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే జమ్మలమడుగులో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినా.. కోర్టు కేసులతో ఆ పరిశ్రమ ఆగిపోయింది. తర్వాత 2018లో మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద.. రాయలసీమ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. సున్నపురాళ్లపల్లె వద్ద కొత్తగా మరోసారి శిలాఫలకం వేశారు.
మూడేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి అదే ప్రాంతంలో భూమిపూజ చేస్తుండడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈసారైనా పరిశ్రమను పూర్తి చేస్తారా, లేక శిలాఫలకానికే పరిమితమవుతారా అని ప్రశ్నిస్తున్నాయి. నేడు జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి.. ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.