CM Revanth Reddy Chit Chat : అసెంబ్లీ సమావేశాల వేళ శాసనసభలోని కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారం క్రితం ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా సమర్పించిన తరుణంలో గత పరిణామాలపై సీఎం స్పందించారు. పేపర్ లీకేజీలు సహా ఉద్యోగాల భర్తీ తీరుపై పూర్తి స్థాయి విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy on CM Convoy Issue : ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం లేకుండా ఉన్న మౌలిక వసతులను పూర్తిగా ఉపయోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తన కాన్వాయ్‌లోని వాహనాలను సైతం మార్చడం లేదన్న ఆయన, కొత్తగా వాహనాలు కొనుగోలు చేయవద్దని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఉపయోగించిన వాహనాలనే తాను ఉపయోగించుకుంటానన్నారు. అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం రంగు మార్పునకు స్టిక్కరింగ్ చేయించాలని చెప్పినట్టు తెలిపారు. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో నియమితులైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించడం పూర్తైందన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే
CM Revanth Reddy Mentioned Key Points In Chit Chat : ప్రగతిభవన్, అసెంబ్లీ భవనాలను గరిష్ఠంగా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలోని సీఎం నివాసం, నేటి ప్రజాభవన్ పరిధిలోని భవనాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉన్న భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉపయోగించుకుంటున్నారని, మిగిలిన మూడు భవనాలను పూర్తి స్థాయిలో వాడుకోనున్నట్లు తెలిపారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగించిన భవనాన్ని మరో మంత్రి నివాసంగా ఉపయోగించుకుంటామని తెలిపారు.
మిగిలిన రెండింటిలో ఒక భవనాన్ని అతిథి గృహంగా, మరో భవనంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం పని చేసే విభాగం కోసం ఉపయోగిస్తామన్నారు. దిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసమే కొనసాగుతుందన్నారు. ప్రతిభకు ప్రాధాన్యమిచ్చేలా పారదర్శకంగా ఉన్నతాధికారుల పోస్టింగ్‌లు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టు అంత ఉపయోగకరం కాదని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ప్రాంతం, చాలా వరకు 111 జీవో రిధిలో ఉండటమే కాకుండా చెరువులు అత్యధికంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లోనే మెట్రో రైలు అలైన్‌మెంట్‌లో మార్పులు ప్రతిపాదించినట్టు వెల్లడించారు.
రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నూతన హైకోర్టు - జనవరిలో శంకుస్థాపన ఏర్పాట్లకు సీఎం ఆదేశాలు
CM Revanth on 24 Hours Current Issue : గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే సరఫరా అయ్యేదని వెల్లడైనట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగిల్ ఫేజ్ మాత్రమే 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంసీఆర్ హెచ్ఆర్డీ(MCRHRD)లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు దిశగా దృష్టిసారించినట్టు సీఎం తెలిపారు. ఇక్కడి ఖాళీస్థలం చదునుచేసి తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ కార్యకలాపాలకు, ప్రజలకు అవరోధం లేకుండా క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా ఖాళీస్థలం వైపు గేటు ఏర్పాటు చేయడంతో ఉపయోగం ఉంటుందన్నారు.
Congress Government in Telangana : శాసనసభ, శాసనమండలి ఒకే ఆవరణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలనే ఉపయోగించుకుంటూ, కొన్ని మార్పులతో ప్రత్యేకంగా పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ లాంటి వసతి ఉండేలా దృష్టి సారించామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు సహా అధికారులు ఉపయోగించే వాహనాలు సుమారు 300 వాహనాలకు పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. అసెంబ్లీ సమీపంలోని నర్సరీ స్థలంతో పాటు శాసనసభ ఆవరణలోని స్థలాలను పూర్తిగా ఉపయోగించుకుంటామన్నారు. జూబ్లీ హాల్‌ను గతంలోలాగే ప్రత్యేక సమావేశాలు, కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం, సమావేశాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామన్నారు.
సీఎం రేవంత్ కీలక నిర్ణయం - రాయదుర్గం టు శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశం