ఇవాళ్టి నుంచి ఎక్కువ బస్సులు..
కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అద్దె బస్సులతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన.. నియమించిన డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో కొన్ని బస్సులు నడిపింది. వీటితో పాటు ప్రైవేట్, విద్యాసంస్థల బస్సులు ప్రయాణికులను చేరవేశాయి. శనివారం దాదాపుగా 9 వేల వాహనాలను ప్రయాణికుల రవాణా కోసం ఉపయోగించినట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచి ఇంకా ఎక్కువ సంఖ్యలో.. ఆర్టీసీ బస్సులు నడుస్తాయని అధికారులు చెప్తున్నారు.
నేడు ఉన్నతస్థాయి సమీక్ష..
ఆర్టీసీ, సమ్మె సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి.. రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చిస్తారు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో... శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యామ్నాయాలు సర్కార్ పరిశీలనలో ఉన్నాయి. 3 నుంచి 4 వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం ఒక ప్రతిపాదన ఉంది. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారి నుంచి.. దరఖాస్తులు స్వీకరించి ఉద్యోగావకాశం కల్పించడం రెండో ప్రత్యామ్నాయం. మూడో ప్రత్యామ్నాయం ఆరు నుంచి ఏడు వేల వరకు ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం అని తెలుస్తోంది.
కిలోమీటర్‌కు రూ.12 నష్టం..
ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల ద్వారా కిలోమీటరుకు 75 పైసల లాభం వస్తోంది. ఆర్టీసీ బస్సు వల్ల కిలోమీటర్ కు రూ.12 నష్టం వాటిళ్లుతోంది. అద్దె బస్సుకు ఆర్టీసీ కేవలం కండక్టర్‌ను మాత్రమే సమకూర్చాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుకు.. సగటున ఐదున్నర మంది సేవలు అవసరం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆర్టీసీకి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోనుంది.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి