CM KCR Inaugurated Telangana Martyrs Memorial : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం నిర్మించిన.. అమరవీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం తిలకించారు. అమరజ్యోతిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అమరుల కుటుంబాలను సన్మానించిన అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల సందర్భంగా జరిగిన ఘట్టాలను గుర్తు చేశారు.
CM KCR Latest Comments : ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు. అత్యుత్తమంగా నిర్మించుకున్నందునే.. కొంత జాప్యం జరిగిందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సాయమందిస్తూ... తమ ప్రభుత్వం పురోగమిస్తోందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధనలో అమరులైన వారి ప్రాణాలకు ఎప్పటికీ వెలకట్టలేమంటూ.. ఆనాటి ఘటనలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇకమీదటా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
'రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. ఈరోజు రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలి కేక వినిపించింది. ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమధనం చేశాం. వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన మార్గదర్శనంలోనే నడిచాం. ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ కాపాడుకొంటూ వచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులను ఉద్యమంలోకి రానివ్వవద్దని మొదట్లో అనుకున్నాం'-సీఎం కేసీఆర్
రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపాం : 1969లో 400 మంది చనిపోయినా.. తర్వాత ఉద్యమం నీరుగారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి వదిలిన ఉద్యమవాది అన్న కేసీఆర్... జలదృశ్యంలోని నివాసాన్ని కొండా లక్ష్మణ్ ఉద్యమానికి ఇచ్చారని గుర్తు చేశారు. అహింసాయుత పద్దతిలోనే పోరాడాలని నిర్ణయించుకున్నామన్న సీఎం.... ఉద్యమపథంలో ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని వ్యాఖ్యానించారు. రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
'నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏనేతపైనా జరిగి ఉండదు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపా. నా నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయి. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారు. ఉద్యమంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఇతర రాష్ట్రాల వారు వస్తే ముందుగా అమరులకు నివాళి అర్పించాలి'.-ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీ చదవండి :